ఒక ఇంజనీర్, ఒక్క ఇంజనీరుని కూడా తయారు చేయలేడు, ఒక డాక్టర్ మహా అయితే ఇంకో డాక్టర్ ని తయారు చేస్తాడేమో.. కానీ కేవలం ఒక టీచర్ మాత్రమే, ఎంతో మంది డాక్టర్లని, మరెంతో మంది ఇంజనీర్లని, తనలాంటి టీచర్స్ ని తయారు చేయగలడు..అందుకేనేమో వేదాలలో, గురువుని దేవుడి కన్నా అర్ఘ్యతాంబూలం ఇచ్చారు…
గురు బ్రహ్మః
గురు విష్ణుః
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మః
తస్మైశ్రీ గురవే నమః
గురు బ్రహ్మః
గురు విష్ణుః
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మః
తస్మైశ్రీ గురవే నమః
నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి
ఐనా ఆదియుగంనుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి
జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు
సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు
అతడు ...ఉపాధ్యాయుడు - సృష్టి స్థితి లయల నిర్దేశకుడు !
పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది. ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠమూ ఒక సూక్తి వంటిది. అందుకే పాఠాలతోపాటు ఆయన బోధించే సారాంశం, పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్ధి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది కాబట్టి ఉపాధ్యాయుడి వాక్కుకు అంత శక్తి ఉంది. ఆ శక్తి అనంతమైనది. విద్యార్ధి చివరి దశ వరకు అతని వెన్నంటే ఉంటుంది. విద్యార్ధి సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.